Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేవంత్ రెడ్డి మన నీళ్లను గిప్ట్ ప్యాక్ చేసి చంద్రబాబుకు పంపిస్తున్నాడు: కవిత

Kalvakuntla Kavitha Revanth Reddy is gift packing our water to Chandrababu Naidu
Advertisement
  • కుప్పంకు నీళ్లిస్తూ పాలమూరు రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణ
  • రాష్ట్రంలో కరవు మండలాలను తక్షణమే ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్
  • రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ హామీ ఏమైందని సూటి ప్రశ్న
  • కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో కరవు పరిస్థితులని విమర్శలు
Advertisement
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నీళ్లను గిఫ్ట్ ప్యాక్ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపిస్తున్నారంటూ తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణా నది జలాలు పొరుగు రాష్ట్రంలోని కుప్పంకు వెళుతున్నాయని, కానీ మన మహబూబ్‌నగర్ రైతులకు మాత్రం చుక్క నీరు అందడం లేదని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత మూడేళ్లలో ఏ ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుపై శ్రద్ధ పెట్టకపోవడం వల్లే రాష్ట్రం నేడు కరవుతో అల్లాడుతోందని విమర్శించారు.

ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, ప్రభావిత మండలాలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎల్ నినో ప్రభావంపై శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా కరవు మండలాలను ప్రకటించకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోందన్నారు.

"నార్లాపూర్ రిజర్వాయర్‌పై కొంతైనా ఖర్చు చేసి ఉంటే, ఈరోజు దాన్ని నింపుకొని కల్వకుర్తి ఆయకట్టుకైనా నీరందించే అవకాశం ఉండేది. దానివల్ల భూగర్భ జలాలు కూడా పెరిగేవి" అని కవిత అభిప్రాయపడ్డారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. పాలమూరు-రంగారెడ్డి వంటి ఎత్తిపోతల పథకాలను నింపకుండా మన నీటిని ఏపీకి తరలిస్తున్నారని ఆరోపించారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు కేవలం 6-7 గంటల కోతలతో సరిపెడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ కోతల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికే కాకుండా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లోనూ తాగునీటి ఎద్దడి మొదలైందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కరవుతో నష్టపోతున్న రైతులకు, ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని, 60 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జ్‌లు క్షేత్రస్థాయిలో పనిచేస్తారని కవిత భరోసా ఇచ్చారు.
Advertisement
Advertisement
Kalvakuntla Kavitha
Revanth Reddy
Telangana Drought
Krishna River Water
Chandrababu Naidu
Telangana Irrigation Projects

More Telugu News